banner

Sunday, 18 November 2012

శివసేన అధినేత బాల్ థాకరే: మరాఠీ పొలిటికల్ టైగర్ ప్రొఫైల్

ముంబై: శివసేన అధినేత బాల్ థాకరే మహారాష్ట్ర రాజకీయాల్లోనే కాదు, దేశ రాజకీయాల్లోనే ఓ సంచలన రాజకీయవేత్త. మరాఠీల ఆత్మగౌరవ నినాదంతో, మరాఠీల హక్కుల పోరాటంతో ఆయన తన ప్రాంతీయ రాజకీయాలను నడిపించారు. హిందూత్వాన్ని ఆలింగనం చేసుకున్నారు. ఆయనను శినసైనికులు దాదాపుగా దేవుడిలాగా ఆరాధిస్తారు. ఆయన ఉద్రేక ప్రసంగాలు అనేక మంది అభిమానులను తయారు చేశాయి.
రాష్ట్ర రాజకీయాల్లో ఆయన కింగ్ కాలేకపోయారు గానీ కింగ్ మేకర్ అయ్యారు. కొంత మందికి మహారాష్ట్ర టైగర్ సాంస్కృతిక యోధుడు కూడా. తన సైగలతో థాకరే దేశ వ్యాపార రాజధాని ముంబైని శాసించారని అంటారు. థాకరే 1950ల్లో ఆర్‌కె లక్ష్మణ్‌తో పాటు ఫ్రీ ప్రెస్ జర్నల్ ఇంగ్లీష్ డైలీలో కార్టూనిస్టుగా జీవితాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత మార్మిక్ పేరుతో 1960లో కార్టూన్ వీక్లీని ప్రారంభించారు. పెరుగుతున్న వలసలకు వ్యతిరేకంగా మరాఠీల ఉనికి కోసం, మనుగడ కోసం పోరాడాలని ఆ పత్రిక ద్వారా ఆయన ఉద్బోధిస్తూ వచ్చారు.
మహారాష్ట్ర మరాఠీల కోసమే అనే నినాదంతో ఆయన తన రాజకీయాలను నడుపుతూ వచ్చారు. మరాఠీ నినాదంతో ఆయన తన మిత్రపక్షం బిజెపిని కూడా వ్యతిరేకించారు. 2007 రాష్ట్రపతి ఎన్నికల్లో మరాఠీ అయినందున కాంగ్రెసు అభ్యర్థి ప్రతిభా పాటిల్‌ను ఆయన బలపరిచారు. ముంబై భారతీయులందరికీ చెందిందని అన్నందుకు థాకరే సచిన్ టెండూల్కర్‌ను కూడా తప్పు పట్టారు.
మరాఠీలకు ఉద్యోగ భద్రత కావాలంటూ మహారాష్ట్ర మరాఠీ భూమి పుత్రులదేనంటూ ఆయన 1966 జూన్ 1వ తేదీన శివసేనను స్థాపించారు. గుజరాతీల నుంచి, దక్షిణాదివారి నుంచి ఉద్యోగాల్లో తీవ్ర పోటీని ఎదుర్కుంటున్న సమయంలో మరాఠీలకే మహారాష్ట్రలో ఉద్యోగాలు దక్కాలని వాదించారు. థాకరేను వక్తృత్వ నైపుణ్యం గొప్ప వక్తగా నిలబెట్టాయి.
బాల్ థాకరే తండ్రి కేశవ్ సీతారాం థాకరే సంయుక్త మహారాష్ట్ర ఆందోళన్‌లో చురుగ్గా పనిచేశారు. బొంబాయి రాజధానిగా మరాఠీలకు ప్రత్యేక రాష్ట్రం కావాలంటూ ఆ ఉద్యమం నడిచింది. గుజరాత్ నుంచి విడదీసి ప్రత్యేక రాష్ట్రం కావాలంటూ చేసిన ఆందోళన కారణంగా కేశవ్ సీతారాం జైలుకు కూడా వెళ్లారు. బాల్ థాకరేకు హిట్లర్ అంటే ఎనలేని అభిమానం.
బొంబాయి మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో సత్తా చాటిన శివసేన 1995 అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపితో పొత్తు పెట్టుకుని మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. రిమోట్ కంట్రోల్‌తో థాకరే ప్రభుత్వాన్ని నడిపారని అంటారు. అయితే, ముఖ్యమంత్రి మాత్రం కాలేకపోయారు. హిందూత్వను తన ఎజెండాలోకి తీసుకుని మహారాష్ట్రలో బిజెపి - శివసేన కూటమి ప్రభుత్వం ఏర్పడండంలో ఆయన ముఖ్య పాత్ర పోషించారు.
పాకిస్తాన్‌తో క్రికెట్ సంబంధాలను కూడా ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. పాకిస్తాన్‌ను, ముస్లిం ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి హిందూత్వమే శరణ్యమని ఆయన నమ్ముతూ వచ్చారు. పాకిస్తాన్ అత్యున్నత పౌర పురస్కారాన్ని స్వీకరించిన దిలీప్ కుమార్‌ను థాకరే వ్యతిరేకించారు. షారూఖ్ ఖాన్ మై నేమ్ ఈజ్ ఖాన్ చిత్రాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు.
అధికారం లేకుండానే ఆయన ఇంటికి రాజకీయ నేతలు, వ్యాపార పారిశ్రామిక అధిపతులు, సినీ ప్రముఖులు వచ్చేవారు. మతతత్వ ప్రాతిపదికపై వోటు వేయాలని ప్రజలకు సూచించినందుకు ఆయన ఆరేళ్ల పాటు 1999 డిసెంబర్ 11 నుంచి 2005 డిసెంబర్ 11వ తేదీ వరకు చిక్కులు ఎదుర్కున్నారు. తాను ప్రతి ముస్లింకు వ్యతిరేకిని కాదని, ఈ దేశంలో నివసిస్తూ ఈ దేశం నియమాలను పాటించనివారికే తాను వ్యతిరేకమని చెప్పారు.
ప్రాంతీయ పార్టీల ఆధిపత్యాన్ని చాటిన రాజకీయవేత్తల్లో బాల్ థాకరే ఒక్కరే. అయితే, తమిళనాడు అన్నాదురై, ఆంధ్రప్రదేశ్ ఎన్టీ రామారావు వంటి ప్రాంతీయ దిగ్గజాల రాజకీయాలకు బాల్ థాకరే రాజకీయాలకు చాలా తేడా ఉంది.














































No comments:

Post a Comment